ఉత్కంఠ మ్యాచ్‌లో ఇండియా విజయం.. సెమీస్‌ బెర్త్‌ ఖాయం

 మహిళల టీ- 20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో సెమీ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఇండియా.. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే సాధించి, ఓటమి పాలైంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కివీస్‌ బ్యాట్స్‌వుమెన్‌ కోలుకోనివ్వలేదు. 13 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌.. వెంటవెంటనే వికెట్లను చేజార్చుకుంది. మ్యాడీ గ్రీన్‌(24), క్యాటీ మార్టిన్‌(25) నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఈ తరుణంలో రెండు జట్ల విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. ఇంతలో భారత బౌలర్లు వెనువెంటనే వికెట్లు పడగొట్టడంతో.. సమీకరణాలు మారిపోయాయి. శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్‌ కివీస్‌ బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో ఎమిలియా కెర్‌(్ర19 బంతుల్లో 34: 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసినా, జట్టును గెలిపించలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. 


అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సీనియర్‌ బ్యాటర్లు స్మృతి మందాన(11), కెప్టెన్‌ హార్మన్‌ప్రీత్‌ కౌర్‌(1) విఫలమైనా.. యువ సంచలనం షెఫాలీ వర్మ 46 పరుగులతో రాణించింది. ఆమెకు తానియా భాటియా(23) చక్కటి సహకారం అందించింది. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్‌ షెఫాలీవర్మ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఈ విజయంతో భారత్‌ సెమీస్‌కు చేరుకుంది.