వనపర్తి: ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
'ధాన్యం అన్‌లోడ్ సమయంలో మిల్లర్లు తరుగు తీసి తీసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. శనగల కొనుగోళ్లలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైతే ప్రైవేట్ గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు తీసుకోవాలి. ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలపై ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎరువులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించాలి. నాగర్‌కర్నూల్ జిల్లా మాచినేని పల్లి దగ్గర మామిడి హోల్‌సేల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని' మంత్రి పేర్కొన్నారు.